Page Loader
US-India: అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్‌ అడుగులు.. జైశంకర్‌ కీలక పోస్ట్‌
అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్‌ అడుగులు.. జైశంకర్‌ కీలక పోస్ట్‌

US-India: అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్‌ అడుగులు.. జైశంకర్‌ కీలక పోస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (టారిఫ్‌ల)పై ప్రపంచంలోని అనేక దేశాలు ప్రతిస్పందన చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో, భారత్ మాత్రం భిన్న దృక్పథాన్ని అవలంబిస్తోంది. పరస్పర సుంకాలు విధించడాన్ని తప్పించి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని సాధించాలన్న దిశగా భారత్ తన దృష్టిని మళ్లించింది. ఈ అంశంపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా ప్రతినిధి మార్కో రూబియో టెలిఫోన్ ద్వారా చర్చలు నిర్వహించారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన ఆమోదించాల్సిన అవసరంపై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా జైశంకర్ 'ఎక్స్‌' (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్. జైశంకర్ చేసిన ట్వీట్ 

వివరాలు 

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 

''అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో చర్చించాను.ఇండో-పసిఫిక్‌, భారత ఉపఖండం, ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, కరేబియన్ ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలపై మేము సమగ్రంగా చర్చించాం. భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన అమలు చేయాల్సిన అవసరం ఉందన్న విషయంపై ఇద్దరం కూడా ఏకాభిప్రాయానికి వచ్చాము. ఈ ఒప్పందంపై మరింత సుశ్రుతంగా సంప్రదింపులు కొనసాగించేందుకు మేము ఎదురుచూస్తున్నాం'' అని జైశంకర్ పేర్కొన్నారు.

వివరాలు 

 ఒప్పందంపై త్వరలోనే అధికారిక ప్రకటన 

ట్రంప్‌ భారత్‌పై సుంకాలు విధించిన అనంతరం, ఇరుదేశాల మధ్య ఇదే మొదటి ఉన్నతస్థాయి చర్చ కావడం విశేషం. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అమెరికా పర్యటన సందర్భంగా వాణిజ్య ఒప్పందంపై ప్రాథమిక అంగీకారాలు కుదిరాయి. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇరుదేశాల నేతలు సంకల్పం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతుండగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఒప్పందంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు 

భారత్‌ అమెరికా వస్తువులపై సగటున 52 శాతం సుంకాలు

అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనీసం 10 శాతం నుండి గరిష్ఠంగా 49 శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు ఏప్రిల్‌ 2న అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భారత్‌ అమెరికా వస్తువులపై సగటున 52 శాతం సుంకాలు విధిస్తున్నదని పేర్కొంటూ, ఆ దేశంపై 26 శాతం టారిఫ్‌లను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ట్రంప్‌ నిర్ణయానికి భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకోదని ఇప్పటికే న్యూఢిల్లీ వర్గాలు స్పష్టంచేశాయి.