Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన రెండవ లేఖపై కేంద్రం శుక్రవారం స్పందించింది. బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు కఠినమైన చట్టాలు, శిక్షలు విధించాలని కోరుతూ ఆమె లేఖ రాసారు. అయితే, కేంద్రం ఆమె లేఖను ఆలస్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణించింది. బెంగాల్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ, సరిగా అమలు చేయలేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పేర్కొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి
పశ్చిమ బెంగాల్‌లో 48,600 రేప్, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ, రాష్ట్రం అదనపు 11 ఎఫ్‌టిఎస్‌సిలను అమలు చేయలేదని దేవి తెలిపారు. పోక్సో కోర్టులు లేదా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయని చెప్పుకొచ్చారు. ముందుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆమె హితవు పలికారు. ఆగష్టు 9న జరిగిన ఈ హత్యాచారంపై సిబిఐ దర్యాప్తు జరుగుతుండగా, బాధితురాలికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతన్నాయి.