Page Loader
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

వ్రాసిన వారు Stalin
Aug 13, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అరుణ్‌ యాదవ్‌ల ట్విట్టర్‌ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఒక పోస్టును రీ ట్వీట్ చేయడంపై అధికార పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. బీజేపీ లీగల్ సెల్ ఇండోర్ యూనిట్ కన్వీనర్ నిమేష్ పాఠక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలన అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా పోస్టులను షేర్ చేస్తున్నట్లు పాఠక్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్

మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: ప్రియాంక గాంధీ

సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక గాంధీ వాద్రా, కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతాల హ్యాండ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామ్‌సనేహి మిశ్రా తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల సంఘం 50శాతం కమీషన్ చెల్లించిన తర్వాతే తమకు బిల్లులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిందని ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40%కమీషన్ వసూలు చేసిందని, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బీజేపీ తన అవినీతి రికార్డును తానే బద్దలు కొట్టినట్లు ప్రియాంక ఆరోపించారు. కర్ణాటక ప్రజలు 40%కమీషన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు 50%కమీషన్‌ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తారని ఆమె పోస్ట్‌లో ఆరోపించారు.