
దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. దిల్లీలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
రానున్న ఐదు నుంచి ఆరు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ తర్వాత వర్షాలు క్రమంగా తగ్గుతాయని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, బుధవారం దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు అధికారులు తెలిపారు.
వాన ముసురు నేపథ్యంలో దిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 23.8 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గాయి.
దిల్లీ
205.5 మీటర్లకు చేరుకున్న యమునా నది నీటి మట్టం
ఇదిలా ఉండగా, దిల్లీ, పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున యమునా నది బుధవారం 205.33 మీటర్ల ప్రమాదకర మార్కును దాటింది.
పాత రైల్వే వంతెన వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 205.5 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.
జూలై 13న 208.66 మీటర్ల నీటి మట్టాన్ని యమునా నది చేరుకొని, రికార్డు బద్దలు కొట్టింది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మళ్లి మార్కుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
దిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం గత 24 గంటల్లో 37.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. దిల్లీలో గత నాలుగు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.