భారత కార్పొరేట్లకు మరో షాక్.. హిండెన్‌బర్గ్ తరహాలో మరో నివేదిక
భారత పారిశ్రామిక దిగ్గజాలకు (కార్పొరేట్లకు) హిండెన్‌బర్గ్ మాదిరి షాక్ తగలనుంది. ఈ మేరకు నిర్దిష్ట కంపెనీల్లో చోటు చేసుకున్న అవకతవకలను ఓసీసీఆర్‌పీ(OCCRP) బయటపెట్టనుంది. కొంత కాలం కిందట భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కుదిపేసింది. ఆ నివేదిక ఎంతలా ప్రకంపణలు సృష్టించిందంటే, ఏకంగా పార్లమెంట్ వేదికగా అదానీపై వివాదాలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు ఉభయసభల్లో రగడ సృష్టించాయి.అయితే తాజాగా అలాంటిదే మరో రిపోర్ట్ తయారైంది. సదరు నివేదిక దేశీయ కార్పొరేట్ సంస్థల్లో నెలకొన్న అవకతవకలను బహిర్గతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు రెడీ అవుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఓసీసీఆర్‌పీకి బిలియనీర్ జార్జ్ సొరోస్ సపోర్ట్
యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని 24 లాభాపేక్షరహిత పరిశోధనాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ బిజినెస్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఆయా కార్పొరేట్ల పనీతరుపై పలు రకాల కథనాలు, నివేదికలను ప్రచురించనున్నారు. నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి జరిగిన అవకతవకలను బట్టబయలు చేయొచ్చని అంచనా. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్‌పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు)కి రాక్‌ఫెలర్ బ్రదర్స్ ఫండ్, జార్జ్ సొరోస్ లాంటి దిగ్గజాల సపోర్ట్ ఉంది. సంఘటిత నేరాలను శోధించడం ఓసీసీఆర్‌పీ సంస్థ ప్రత్యేకతగా నిలుస్తోంది. బిలియనీర్ జార్జ్ సొరోస్‌కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ తదితర సంస్థలు, ఓసీసీఆర్‌పీకి నిధులు సమకూరుస్తుండటం గమనార్హం.