LOADING...
Polavaram: పోలవరం గ్యాప్‌ డ్యాంలలో షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు
పోలవరం గ్యాప్‌ డ్యాంలలో షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు

Polavaram: పోలవరం గ్యాప్‌ డ్యాంలలో షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టులో గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో రోలింగ్‌ ప్రక్రియకు షీప్‌ ఫుట్‌ రోలర్లు వినియోగించాలని విదేశీ నిపుణులు సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ రోలర్ల వినియోగంతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశీ నిపుణులు హించ్‌బెర్గర్‌,డేవిడ్‌ బి.పాల్‌, ఫ్రాంకో డి సిస్కోలు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రధాన డ్యాం పనులతో పాటు డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూడా వారు పరిశీలించారు. గ్యాప్‌-1,గ్యాప్‌-2 డ్యాం పనుల్లో ప్రస్తుతం రోలింగ్‌ను ఏ విధంగా నిర్వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు ఫ్లాట్‌ రోలర్లు, వైబ్రేటెడ్‌ రోలర్లు ఉపయోగిస్తున్నామని వివరించారు. అయితే షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు.

వివరాలు 

షీప్‌ ఫుట్‌ రోలర్లు వినియోగించాల్సిన అవసరం

దీనికి స్పందించిన అధికారులు,ట్రయల్‌ ఎంబ్యాంక్‌మెంట్‌ పనుల్లో షీప్‌ ఫుట్‌ రోలర్లు ప్రయోగాత్మకంగా వాడినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని,అందుకే ప్రస్తుతం ఇతర రోలర్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం గ్యాప్‌-1,గ్యాప్‌-2 డ్యాంలలో రోలింగ్‌ పనులను తామే ప్రత్యక్షంగా పరిశీలిస్తామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విదేశీ నిపుణులు అధికారులను ఆదేశించారు. డయాఫ్రం వాల్‌ను ఆనుకుని ప్లాస్టిక్‌ క్లే కోర్‌ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా షీప్‌ ఫుట్‌ రోలర్లు వినియోగించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పనుల ఆకృతులు,డ్రాయింగ్‌లకు సంబంధించిన అనేక ప్రశ్నలను అధికారులు ముందుంచారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయో,ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే డీ-హిల్‌ గ్రౌటింగ్‌ పనులను కూడా దగ్గరుండి పరిశీలించారు.

వివరాలు 

ఫిబ్రవరికి డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి

డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించారా లేదా అనే విషయాన్ని విదేశీ నిపుణులు ప్రత్యేకంగా ఆరా తీశారు. నిర్మాణ సమయంలో తలెత్తిన బ్లీడింగ్‌ సమస్య, రాతి పొరల్లోకి ప్లాస్టిక్‌ కాంక్రీటును ఎంత లోతు వరకు నింపాలన్న అంశాల్లో వచ్చిన సమస్యలు ప్రస్తుతం పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. తిరుపతి ఐఐటీ నిపుణులతో కలిసి రూపొందించిన మెథడాలజీ ప్రకారం పనులు చేపట్టడంతో బ్లీడింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని వివరించారు. ఫిబ్రవరి నాటికి డయాఫ్రం వాల్‌ పనులను పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, ప్రాజెక్ట్‌ అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమావేశం 

ఈ పనులకు సంబంధించి నిర్వహించిన నాణ్యత నియంత్రణ పరీక్షల ఫలితాలను విదేశీ నిపుణులు పరిశీలించారు. పనుల డాక్యుమెంటేషన్‌ మరింత పకడ్బందీగా ఉండాలని సూచించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, ప్రాజెక్ట్‌ అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమావేశమై పనుల పురోగతి, నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కార్యదర్శి రఘురామ్‌, జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ నరసింహమూర్తి, పోలవరం ఎస్‌ఈ రామచంద్రరావు, కేంద్ర జలసంఘం డిజైన్ల సీఈ సరబ్‌జిత్‌సింగ్‌ భక్షి, డైరెక్టర్‌ మనీష్‌ రాఠోడ్‌, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులు మనీష్‌ గుప్తా, రవి అగర్వాల్‌, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ప్రతినిధి రామారావు, పోలవరం అథారిటీ డైరెక్టర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement