Page Loader
KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ పని ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఈ కమిషన్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. తాజాగా మాజీ మంత్రుల విచారణను ప్రారంభించింది. ఇదే తరహాలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును (కేసీఆర్‌) కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది. ఈ విచారణ బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.

వివరాలు 

సీపేజ్‌, కుంగింపుల నేపథ్యంలో కమిషన్‌ 

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం,అలాగే అన్నారం,సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్ సమస్యలు ఏర్పడటంతో, 2023 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ను నాయకత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ విభాగాలు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల అధికారులు, అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్‌ విచారించింది. వారందరి నుండి అఫిడవిట్లు తీసుకొని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను పూర్తిచేసింది.

వివరాలు 

మాజీ మంత్రుల హాజరు 

ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత 9వ తేదీన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా విచారణలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలు మీడియా సమక్షంలో, అలాగే కమిషన్‌కు చెందిన ఇంజినీర్ల ఉపస్థితిలో సాగాయి. కేసీఆర్‌ విచారణ కూడా ఇదే విధంగా మాధ్యమాల సమక్షంలో జరగబోతుందా? లేకపోతే కేవలం కమిషన్‌ అధికారుల సమక్షంలో మాత్రమే "ఇన్‌-కెమెరా" విచారణగా కొనసాగుతుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

వివరాలు 

భారత రాష్ట్ర సమితి నాయకులతో చర్చలు 

ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌ మంగళవారం భారాస ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. కమిషన్‌ హరీశ్‌రావుతో చేపట్టిన చర్చలపై విశ్లేషణ జరగడంతో పాటు, మరికొన్ని అదనపు అంశాలపై కూడా లోతుగా చర్చించినట్లు సమాచారం. బుధవారం విచారణ సమయంలో కేసీఆర్‌తో పాటు పార్టీకి చెందిన ముఖ్యనాయకులు కూడా ఆయనతో కలిసి విచారణ ప్రాంగణానికి రానున్నారు.

వివరాలు 

9 మందితో కూడిన జాబితా సిద్ధం 

విచారణ సమయంలో పరిమిత సంఖ్యలోనే వ్యక్తులను అనుమతించే అవకాశముండటంతో ముందుగానే తొమ్మిది మంది నేతల జాబితా కమిషన్‌కు పంపినట్లు సమాచారం. ఆ జాబితాలో హరీశ్‌రావు, మధుసూదనాచారి, ప్రశాంత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మహమూద్‌ అలీ, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.