
Prajwal Revanna: అత్యాచారం కేసులో దోషిగా మాజీ ఎంపీ.. జీవిత ఖైదు విధించిన కోర్టు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో పనిచేసే మహిళపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు జీవిత ఖైదు శిక్ష పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్షను శుక్రవారం ఖరారు చేసింది. విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే జూలై 26న ఆయనను దోషిగా తేల్చగా, తాజాగా శిక్షను ప్రకటించారు. ఈ కేసులో తాను తక్కువ శిక్షకు అర్హుడినని వాదిస్తూ, న్యాయమూర్తిని ప్రజ్వల్ వేడుకున్న విషయం తెలిసిందే. తన వాదనను వినిపించే సమయంలో బిగ్గరగా ఏడ్చిన ఆయన, ఆగస్టు 1న తీర్పు వెలువడిన తర్వాత కూడా కన్నీరుమున్నీరయ్యాడు.
Details
బయటికొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన ఎంపీ
న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వెక్కివెక్కి ఏడ్చినట్లు సమాచారం. కర్ణాటకలోని కేఆర్ నగర్‌కు చెందిన 47 ఏళ్ల మహిళ, 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్‌పై అత్యాచారానికి సంబంధించి ఫిర్యాదు చేసింది. గన్నిగడ ఫాం హౌస్‌లో ఈ ఘటన జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, అనంతర కాలంలో మరిన్ని అత్యాచార ఆరోపణలు ప్రజ్వల్‌పై వచ్చాయి. విచారణ ప్రక్రియలో భాగంగా గత 14 నెలలుగా ప్రజ్వల్ రేవణ్ణ విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆయనపై జీవిత ఖైదు విధించడంతో కేసులో తుది తీర్పు వెలువడినట్లైంది.