పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన అజెండాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. లోక్‌సభలో రెండు, రాజ్యసభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. మొదటి రోజు లోక్‌సభలో 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం - విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అంశంపై చర్చ ఉంటుంది. రెండో రోజు నుంచి సమావేశాలకు కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన వివాదాస్పద బిల్లును ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లు చర్చకు వచ్చే అవకాశం
లోక్‌సభ, రాజ్యసభలో మరో మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ది అడ్వకేట్స్(సవరణ) బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు- 2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు- 2023ను కేంద్రం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులతో పాటు మరికొన్ని అంశాలు కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రావచ్చని తెలుస్తోంది. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా 'భారత్' పేరు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీలకు సమాచారం అందించారు.