Henley Passport Index ranks: ప్రపంచ దేశాల్లో 85వ స్థానంలో భారత్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్
2024కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదలైంది. ఫ్రాన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారి 84వ స్థానం నుంచి 85వ స్థానానికి చేరుకుంది. భారతదేశం ర్యాంకింగ్‌లో ఈ క్షీణత ఆశ్చర్యం కలిగించవచ్చు. గత సంవత్సరం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 60 దేశాలకు ప్రయాణం చేస్తే , ఈ సంవత్సరం ఆ సంఖ్య 62 కి పెరిగింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ వారి పాస్‌పోర్ట్‌ల బలం ఆధారంగా దేశాలను ర్యాంక్ చేస్తుంది. 2024లో, 194 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌ను మంజూరు చేసిన పాస్‌పోర్ట్‌తో ఫ్రాన్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
58వ స్థానంలో మాల్దీవులు
జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా ఫ్రాన్స్‌తో పాటు అగ్రశ్రేణి దేశాలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ 106వ స్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 101వ స్థానం నుంచి 102వ స్థానానికి దిగజారింది. భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవులు బలమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నారు. మాల్దీవులు 58వ స్థానంలో కొనసాగుతున్నారు. మాల్దీవుల పాస్‌పోర్ట్ హోల్డర్లు 96 దేశాలకు వీసా-రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఇరాన్, మలేషియా,థాయ్‌లాండ్‌లు భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత కూడా భారతదేశం ర్యాంకింగ్స్‌లో పడిపోయింది.
2006లో 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ప్రత్యేక డేటా ఆధారంగా గత 19 సంవత్సరాల డేటా నుండి దాని ర్యాంకింగ్‌లను పొందింది. ఈ సూచిక నెలవారీగా నవీకరించబడుతుంది. స్వతంత్ర దేశాల పౌరులకు ప్రపంచ ప్రమాణంగా పనిచేస్తుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా గత రెండు దశాబ్దాలుగా గ్లోబల్ మొబిలిటీలో గణనీయమైన మార్పులను సూచిస్తుంది. 2006లో,ప్రజలు సగటున 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ సంవత్సరం, ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయి 111 దేశాలకు చేరుకుంది.