LOADING...
Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో కీలక హామీలు
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో కీలక హామీలు

Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో కీలక హామీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏఐఏడీఎంకే కీలక రాజకీయ అడుగు వేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళణిస్వామి తొలిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల రోజువారీ జీవనానికి నేరుగా ఉపయోగపడేలా ఐదు ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు పార్టీ ప్రకటించింది. మహిళల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక హామీ ఇచ్చింది ఏఐఏడీఎంకే. ప్రతి మహిళకు నెలకు రూ.2,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించే సంక్షేమ పథకాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఈ హామీ రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది.

Details

ఏఐఏడీఎంకే సంచలన ప్రకటన

రవాణా రంగంలోనూ ఏఐఏడీఎంకే సంచలన ప్రకటన చేసింది. నగరాల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత ప్రయాణ పథకాన్ని విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది. ఇల్లు లేని వారి కోసం 'అమ్మ ఇంటి పథకం'ను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి, కాంక్రీట్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది.అలాగే పట్టణ ప్రాంతాల్లో నివాసం లేని వారికి అపార్ట్‌మెంట్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒకే కుటుంబానికి చెందిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వివాహానంతరం విడివిడిగా నివసించినా, వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది.

Details

ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ

మహిళల సాధికారత దిశగా మరో కీలక నిర్ణయంగా 'అమ్మ టూ వీలర్ పథకం'ను తిరిగి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కోసం ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా విస్తరించనున్నట్లు ఏఐఏడీఎంకే ప్రకటించింది. ప్రస్తుతం 100 రోజులుగా అమలులో ఉన్న ఉపాధి హామీ పనిదినాలను 150 రోజుల వరకు పెంచుతామని హామీ ఇచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, వలసలు తగ్గుతాయని పార్టీ భావిస్తోంది.

Advertisement