Page Loader
Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 
Free Driving Classes For Women

Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల మహిళలకు 45 నుంచి 60 రోజులపాటు కూకట్‌పల్లిలోని కార్పొరేషన్‌కు చెందిన డీఎంఎస్ వీకే (దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రం) లోని ప్రత్యేక డ్రైవింగ్ ట్రాక్‌లో శిక్షణ అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సెషన్లుగా ఈ శిక్షణ కొనసాగుతోంది.ఈ కేంద్రంలోని డ్రైవింగ్ ట్రాక్‌లో ట్రైనర్లు ప్రారంభంగా ప్రాక్టికల్ డ్రైవింగ్ నేర్పిన అనంతరం, క్లాస్‌రూం సెషన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లపై పాటించాల్సిన నియమాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించబడుతుంది.

వివరాలు 

జిల్లాల్లో త్వరలో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం 

గతేడాది ఆగస్టులో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు 45 మంది మహిళలు ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నారు. రాబోయే నెల 5వ తేదీ నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది. ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి 10 ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో స్వంత భవనాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే జిల్లాల్లోనూ మహిళలకు ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాల్లో ప్రారంభిస్తే, భారీ స్పందన వస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.