Arvind Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆప్ కీలక హామీ
వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆప్ (AAP) పార్టీ కీలకమైన హామీని ప్రకటించింది. దిల్లీలోని సీనియర్ సిటిజన్లకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించనున్నట్లు ఆప్ హామీ ఇచ్చింది. మరోసారి ఆప్ అధికారంలోకి వస్తే, 60 ఏళ్ల పైబడి వృద్ధులకు ఉచిత వైద్యం అందించే 'సంజీవని యోజన'ను అమలు చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. "వయో వృద్ధుల సంరక్షణ మా బాధ్యత" అని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్, "మీరు ఎంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు" అని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సంఘం ఈవారంలో సమావేశం
సీనియర్ సిటిజన్లు అనారోగ్యానికి గురైతే,వారి చికిత్సకు సంబంధించి ఎలాంటి ఖర్చు గరిష్ఠ పరిమితి ఉండదని కేజ్రీవాల్ వివరించారు. ఈ చర్యకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుందని,ఆప్ కార్యకర్తలే ఇళ్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారని చెప్పారు. వారు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి రాగానే ఈ ఉచిత వైద్యం విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇంకా,దిల్లీ ఎన్నికల సమీక్ష కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవారంలో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఆధారంగా,త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆప్ 70స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఆప్ చీఫ్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నుంచి పోటీ చేయనుండగా,సీఎం ఆతిశీ కల్కాజీ సీటు నుంచి బరిలో నిలవనున్నారు.