LOADING...
Bomb threats: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం
దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం

Bomb threats: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు రావడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న రామ్‌జాస్ కాలేజ్, మిరాండా హౌస్‌లకు సోమవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ అందాయి. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలాలకు చేరుకుని క్యాంపస్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.

వివరాలు 

ఢిల్లీ మేయర్ కార్యాలయానికి కూడా బెదిరింపు ఈ-మెయిల్

ఇక ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కార్యాలయానికి కూడా బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం సుమారు 2:11 గంటల ప్రాంతంలో కార్యాలయాన్ని పేల్చేస్తామని హెచ్చరిక రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేసి సమగ్ర తనిఖీలు చేపట్టారు. చండీగఢ్‌లోని పలు పాఠశాలలు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా బెదిరింపు మెయిల్స్ ఉదయం సమయంలో అందాయి. అదేవిధంగా పంజాబ్, హర్యానా సచివాలయాలు మరియు ఫిరోజ్‌పూర్ జిల్లా కోర్టుకూ ఈ హెచ్చరికలు చేరాయి.

వివరాలు 

'ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ' పేరుతో ఈ మెయిల్స్

అధికారుల సమాచారం మేరకు అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరం చేశాయి. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్‌లను విస్తృతంగా మోహరించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రాథమికంగా 'ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ' పేరుతో ఉన్న ఓ సంస్థకు చెందిన వ్యక్తి ఈ మెయిల్స్ పంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ నిపుణులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement