VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్ 9 నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ప్రారంభించనున్నారు. విజయవాడలో ఈ సర్వీసుల ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కొద్ది నెలల క్రితం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసులను ఆమోదించినప్పటికీ, అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో, ప్రకాశం బ్యారేజీ దగ్గర సీ ప్లేన్ అంశం కొత్తగా పునరుద్ధరించబడింది. కేంద్రం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించనుండడంతో, విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సర్వీసులను డిసెంబర్ 9న ప్రారంభించాలని నిర్ణయించారు.
విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. భవిష్యత్తులో మరిన్ని రూట్లకు విస్తరించనుంది. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో కృష్ణా జలాల్లో సీ ప్లేన్ సేవలు విజయవాడ వాసులకు అందుబాటులో రానున్నాయి. మొదటి దశలో విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు ప్రారంభించనున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ సర్వీసులను మరింత విస్తరించవచ్చు. ఇతర పర్యాటక ప్రాంతాలకు సర్వే నిర్వహించి, అవసరమైన మార్గాలను అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక వాటర్ ఏరోడ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లేన్‌ల రాకపోకల కోసం వాటర్ వేను కూడా ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఏరోడ్రమ్ కోసం ఇప్పటికే పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే చేస్తున్నారు.
దుర్గాఘాట్ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం సమీపంలో, దుర్గాఘాట్ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సీ ప్లేన్ సర్వీసులు విజయవాడ - శ్రీశైలంపై పర్యాటకుల కోసం సులభమైన మార్గాన్ని అందిస్తాయి. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జులను చూడడం మరింత సులభమవుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. సీ ప్లేన్ ల్యాండింగ్ కోసం ప్రత్యేకమైన వాటర్ వేను ఏర్పాటు చేయనున్నారు. విమానం ల్యాండైన తర్వాత, ప్రయాణికులను ఎక్కించుకోడానికి వాటర్ వే నిర్మాణం చేపడతారు. జెట్టీ నిర్మాణం కూడా చేయనున్నారు, ఇది సీ ప్లేన్ సమీపానికి చేరుకుంటుంది. ప్రయాణికులు జెట్టీ ద్వారా బోటుకు రాకపోకలు సాగించాలి.
శ్రీశైలంలో పాతళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్
విజయవాడ నుంచి బయలుదేరిన సీ ప్లేన్ నేరుగా శ్రీశైలంలో పాతళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్ అవుతుంది. సీ ప్లేన్ సర్వీసుల ఖరారు ఇంకా జరుగలేదు, కానీ విజయవాడ-శ్రీశైలం సర్వీస్ విజయవంతం అయితే, భవిష్యత్తులో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు కూడా ఈ సర్వీసులు విస్తరించనున్నాయి. శ్రీశైలం రూట్‌కు లభించే ఆదరణ ఆధారంగా మిగిలిన సర్వీసులను నిర్వహిస్తారు.