Maharastra: కరవు గడ్డలో మహిళల సాగు విజయం.. ఐదు రాష్ట్రాలకు గుమ్మడికాయల ఎగుమతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో కరవుతో అల్లాడే బీడ్ జిల్లాలోని ఆష్టీ మండలం మెహెకరి గ్రామ మహిళలు కలిసి సాగు చేపట్టి ఆర్థికంగా స్వావలంబన దిశగా కీలక అడుగు వేశారు. గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు పండించిన 'డోంగర్ భోపలా' (గుమ్మడికాయ) ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు సరఫరా అవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మందాకిని నేతృత్వంలో సంఘానికి చెందిన మహిళలు ఒక్కో కాతకు ఎకరాకు కేవలం రూ.7 వేల పెట్టుబడితో ఈ పంటను సాగు చేశారు. ఏడాది వ్యవధిలో మూడు దఫాలుగా పంట కోయగా, ప్రతి సారి సుమారు 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల దిగుబడి లభించింది.
వివరాలు
పిచికారీకి సేంద్రియ ద్రావణాలు
పంట సాగులో రసాయన ఎరువులు పూర్తిగా వినియోగించలేదని మందాకిని తెలిపారు. పొలాల్లో లభించే చెత్త, ఆకులు, పాడైన మొక్కల అవశేషాలతోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని ఉపయోగించామన్నారు. అలాగే పిచికారీకి కూడా పూర్తిగా సేంద్రియ ద్రావణాలనే వాడామని చెప్పారు. ఈ కారణంగానే గుమ్మడికాయలు అత్యుత్తమ నాణ్యతతో పండాయని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు. మధ్యవర్తులను పక్కన పెట్టి నేరుగా కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకొని అమ్మకాలు జరపడం ద్వారా మహిళలు మెరుగైన లాభాలు సాధిస్తున్నారు.