Page Loader
Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ 
Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ

Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ 

వ్రాసిన వారు Stalin
Feb 26, 2024
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సింగ్‌భూమ్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్‌ను వీడారు. సోమవారం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనమా చేసి.. బీజేపీలో చేరారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక లోక్‌సభ ఎంపీ గీతా కోడానే కావడం గమనార్హం. ఉన్న ఒక్క ఎంపీ కూడా బీజేపీలో చేరడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ క్యాడర్‌లో నైరాష్యం నెలకొంది. వాస్తవానికి జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమిపై గీతా కోడా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో గీతా కోడా సోమవారం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత అమర్‌కుమార్‌ బౌరీతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది: గీతా కోడా

గీతా కోడా 2009-2019 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 2019లో తొలిసారిగా ఆమె సింగ్‌భూమ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2022జనవరిలో హోంమంత్రి అమిత్ షా జార్ఖండ్‌లో పర్యటించినప్పటి నుంచి ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ ఊహాగానాలకు నిజం చేస్తూ.. చివరికి అమె బీజేపీలో చేరారు. కోడా దంపతులకు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉందని బాబూలాల్ మరాండీ అన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారు బీజేపీ నుంచి బయటకు వెళ్లారని, ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారన్నారు. బీజేపీలో చేరిన అనంతరం గీతా కోడా మాట్లాడుతూ.. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. బాబూలాల్ మరాండీ తొలి ప్రభుత్వంలో మధు కోడా మంత్రిగా ఉన్నారు.