Page Loader
ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్
భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

వ్రాసిన వారు Stalin
Mar 11, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు. ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లో తమ 'కాశ్మీర్' ఎజెండాను తీసుకునేవారు లేరని భుట్టో జర్దారీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలోకి కశ్మీర్‌ను తీసుకురావడానికి పాకిస్థాన్ చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లో చర్చిస్తున్న అంశం లేదా ఎజెండాతో సంబంధం లేకుండా కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదే పదే లేవనెత్తడం గమనార్హం. అయినా ఐక్యరాజ్య సమితిని మద్దతును పాకిస్థాన్ పొందలేకపోయింది. ఐక్యరాజ్య సమితి కూడా కశ్మీర్ అంశాన్ని భారతదేశం-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సమస్యగా పరిగణించింది.

పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితి కశ్మీర్‌పై కూడా దృష్టి పెట్టాలి: జర్దారీ

ఐక్యరాజ్య సమితి కౌన్సిల్‌ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్‌లో కశ్మీర్ అంశాన్ని ప్రసావించినప్పుడల్లా పొరుగు దేశం(భారత్) గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితికి సంబంధించిన వివాదం కాదని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివాదాస్పద భూభాగం కాదనే విషయాన్ని భారత్ చెబుతోందని అన్నారు. పాకిస్థాన్‌కు సత్యాన్ని వెలికితీయడం కష్టమైనప్పటికీ, పట్టుదలతో ముందుకు పోతామన్నారు. పాలస్తీనా -పాకిస్థాన్ పరిస్థితి రెండూ ఒకటేనని పేర్కొన్నారు జర్దారీ. ఐక్యరాజ్య సమితి పాలస్తీనాపై మాత్రమే కాకుండా కాశ్మీర్‌పై కూడా అదనపు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.