పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోదని, సైనిక బలగాల ద్వారా ధీటైన సమాధానం చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రధాని మోదీ హయాంలో భారత్ గతంలో కంటే సైనిక శక్తిలో బలంగా ఎదిగిందని చెప్పింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్: అమెరికా
కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతదేశం- పాకిస్థాన్ మధ్య సంబంధాలు తరచుగా దెబ్బతింటూ వస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంక్షోభాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక చెబుతోంది. రెండు అణ్వాయుధ దేశాల కావడమే ఇందుకు కారణమని వివరించింది. 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఇరు దేశాలు పునరుద్ధరించాయి. ఆ తర్వత నుంచి ఇరు దేశాలు తమ సంబంధాలను, ప్రశాంతతను బలోపేతం చేయడానికి మొగ్గు చూపుతున్నాయ నివేదిక పేర్కొంది.