Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తూ, మూసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ (GHMC) దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విస్తరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
నైట్ బజార్ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు
ఈ క్రమంలో ఇంజినీరింగ్, యూబీడీ విభాగాల ఆధ్వర్యంలో 329 పనులను చేపట్టింది. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. రూ.178.87 కోట్లతో నగరానికి న్యూ లుక్ అందించేందుకు కమిషనర్ ఆమ్రపాలి కాట ఇటీవల ఆమోదం తెలిపారు. రెండు ప్రాంతాల్లో నైట్ బజార్ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన విద్యుద్దీపకాంతులు, స్ట్రీట్ ఫర్నీచర్‌తో ఆయా ప్రాంతాలను సుందరీకరించడానికి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది చివరికి పనులు పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
కొత్త పనులకు జీహెచ్‌ఎంసీ ఆమోద ముద్ర
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్కిళ్ల బ్యూటిఫికేషన్ పనులను కొనసాగిస్తూ, కొత్త పనులకు జీహెచ్‌ఎంసీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు పూర్తయ్యాయి, మరో 125 కూడళ్లలో పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. 89 పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ సర్కిల్, తదితర కూడళ్లలో విస్తరణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయని తెలిపారు. డిసెంబర్, జనవరిలో నగరంలోని రోడ్ల వెంట పూల మొక్కలు నాటనున్నారు.
ఏ ప్రాంతానికి ఎంత దూరం అని తెలిపే సైన్ బోర్డులు ఏర్పాటు
ప్రధాన కూడళ్లలో కొత్త కరెంట్ స్తంభాలు, డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్లైఓవర్లపై ప్రకృతి, ప్రముఖులు, వేర్వేరు వృత్తులు, తెలంగాణ రాష్ట్ర కళలను ప్రతిబింబించే చిత్రాలతో డిజైన్లు వేస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారులపై ఏ ప్రాంతానికి ఎంత దూరం అని తెలిపే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయా పనులు వేగంగా పూర్తి చేసి నగర వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు.