
Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యల పరిష్కారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
వరద ముంపు సమస్యలతో పాటు అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్తంగా పని చేయాలని ఈ రెండు విభాగాలు నిర్ణయించాయి.
ఈ క్రమంలో, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమైన హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు రంగనాథ్, ఇలంబర్తి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, అగ్నిప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించారు.
వివరాలు
అవసరమైన చర్యలు
అగ్నిప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక శాఖతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే వర్షాకాలంలో వరద ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని కమిషనర్లు నిర్ణయించారు.
ఈ రెండు కమిటీలు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అధికారుల సమన్వయంతో సమస్యలు మళ్లీ ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాయని వెల్లడించారు.