
Hyderabad: హైదరాబాద్'లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం.. నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గించే ఉద్దేశంతో సిగ్నల్ ఫ్రీ ఫ్లై ఓవర్లు నిర్మించారు. తాజాగా మరిన్ని ప్రాంతాల్లో కూడా ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలైంది. కొన్నింటికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.ఈ క్రమంలో నాగార్జునసాగర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణించే వారికి సులభతరం చేయడానికి మరో ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు, రోడ్ అండర్‌బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు) నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మార్గం ఉండే అవకాశం ఉన్నందున, ప్రాజెక్టుల రూపకల్పనను మెట్రో అధికారులతో సమన్వయం చేసుకుంటూ రూపొందిస్తున్నారు.
వివరాలు
చేపట్టనున్న ప్రధాన పనులు
త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (డీపీఆర్‌లు)పూర్తి చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నట్లు సంబంధిత ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. దాదాపు మూడు నెలల్లో ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించింది. 1. టీకేఆర్ కాలేజీ జంక్షన్ ఫ్లై ఓవర్- టీకేఆర్ కాలేజీ,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం. 2. ఒమర్ హోటల్ జంక్షన్ ఫ్లై ఓవర్-హఫీజ్‌బాబానగర్ నుంచి బాలాపూర్, చర్చిరోడ్ జంక్షన్ వరకు (ఒమర్ హోటల్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా షోయబ్ హోటల్ వరకు) ఆరు లేన్ల ఫ్లై ఓవర్. 3.బండ్లగూడ జంక్షన్ ఫ్లై ఓవర్ - బండ్లగూడ నుంచి ఎర్రకుంట జంక్షన్ వరకు ఆరు లేన్ల ఫ్లై ఓవర్.
వివరాలు
చేపట్టనున్న ప్రధాన పనులు
4. మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్ ఫ్లై ఓవర్- మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్‌ల వద్ద ఆరు లేన్ల ఫ్లై ఓవర్. 5.ఆరాంఘర్ జంక్షన్ ఆర్‌యూబీలు- ప్రస్తుతం ఉన్న ఆర్‌యూబీ రెండు వైపులా, మరో రెండు లేన్లతో రెండు కొత్త ఆర్‌యూబీల నిర్మాణం. ప్రతి పనిని ప్రత్యేకంగా అమలు చేయనున్నారు. ఇవి పూర్తి అయితే సికింద్రాబాద్, ఉప్పల్ వంటి ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్ దిశగా వచ్చే వారికి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, సమయాన్ని ఆదా చేస్తూ సులభంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు, కష్టాలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొంటున్నారు.
వివరాలు
టోపోగ్రాఫికల్ సర్వే, ట్రాఫిక్ సర్వేలు
డీపీఆర్‌లో భాగంగా టోపోగ్రాఫికల్ సర్వే, ట్రాఫిక్ సర్వేలు నిర్వహించనున్నారు. అలాగే రద్దీ సమయాల్లో వాహనాల సంఖ్య, రాబోయే మెట్రో రైలు కారిడార్, సీటీఎస్ (కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ & ట్రాన్స్‌పోర్ట్ స్టడీ) మాస్టర్ ప్లాన్, బీఆర్‌టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) వంటి భవిష్యత్ ప్రాజెక్టులను కూడా పరిశీలనలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులు హై సిటీ (Hyderabad City Innovative and Transformative Infrastructure) ప్రాజెక్ట్ కింద, ఎల్‌బీనగర్-ఆరాంఘర్ కారిడార్‌లో భాగంగా చేపట్టబడతాయి.
వివరాలు
భవిష్యత్తులో నగర జనాభా మరింత పెరుగుతుందని అంచనా
ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం ఎక్కువ. అలాగే టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్) పరిధిలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అత్యవసరంగా భావిస్తోంది. పైగా అదే మార్గంలో డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, మిధాని వంటి ప్రముఖ రీసెర్చ్ సంస్థలు, ప్రయోగశాలలు ఉన్నందున సదరు మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నగర జనాభా కోటికి మించి ఉండగా, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం కాకుండా ముందుగానే ఏర్పాట్లు చేయడం కోసం ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు నిర్మించనున్నారు.