Page Loader
Armour Turmeric: ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌
ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌

Armour Turmeric: ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) త్వరలో రానుంది. ఈ ప్రాంత రైతులు దశాబ్దాలుగా పసుపును ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఆర్మూర్‌ పసుపు ప్రత్యేకతను గుర్తించి, జీఐ ట్యాగ్‌ కోసం నాబార్డ్‌ సహకారంతో శాస్త్రవేత్తలు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో ఆర్మూర్‌ వాతావరణ పరిస్థితులు, భూమి లక్షణాలు, పసుపులో ఉండే ప్రత్యేక లక్షణాలు, సాగు చరిత్ర, డాక్యుమెంటరీ ఆధారాలపై వివరాలను సేకరించారు. శాస్త్రవేత్తలు స్వయంగా పొలాలను సందర్శించి, రైతుల నుంచి పసుపు రకాల విశిష్టతలను తెలుసుకున్నారు.

వివరాలు 

పసుపు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేపట్టి నమూనాల అధ్యయనం

జీఐ ట్యాగ్‌ కోసం నాలుగు నెలల్లో చెన్నైలోని మేధోసంపత్తి హక్కుల కేంద్రానికి దరఖాస్తు చేస్తామని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల అసోసియేట్‌ డీన్‌, ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ పిడిగం సైదయ్య తెలిపారు. ఈ ట్యాగ్‌ ద్వారా ఆర్మూర్‌ పసుపుకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గౌరవం పెరగడమే కాకుండా, ఎగుమతులు పెరిగి, అధిక ధర పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో పసుపు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేపట్టి నమూనాలను అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. ఈ బృందంలో కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు బీ మహేందర్‌, పీ శ్రీనివాస్‌, నాబార్డ్‌ డీడీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.