సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ
అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పు, మహమ్మారి, తీవ్రవాదం, యుద్ధాలు ఇలా గత కొన్నేళ్ల అనుభవాల నేపథ్యంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలమైందని స్పష్టం చేశారు. జీ20 ప్రెసిడెన్సీలో దక్షిణాది దేశాలకు గొంతును వినిపించడానికి భారత్ ప్రయత్నిస్తుందని మోదీ పేర్కొన్నారు.
'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్
చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రజలకు ఆహారం, ఇంధన భద్రతను ఇవ్వలేక భరించలేని అప్పులతో పోరాడుతున్నాయని చెప్పారు. జీ20 ప్రెసిడెన్సీ కోసం 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్‌ను భారత్ ఎంచుకున్నదని ప్రధాని మోదీ చెప్పారు. ఇది ప్రపంచ దేశాల ఐక్యత అవసరాన్ని, తద్వారా కలిగే ప్రయోజనాలను సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. పోటీ ప్రయోజనాలను సమతుల్యం చేయడం ద్వారా భవిష్యత్ యుద్ధాలను నిరోధించడం, ఉమ్మడి ప్రయోజనాల సమస్యలపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని చెప్పారు.