Ayyappa devotees: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమానాల్లో ఇరుముడికి గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విమానంలో ప్రయాణించే అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు తమ పవిత్ర ఇరుముడి (కొబ్బరికాయ సహా)ని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. భద్రతా కారణాల వల్ల ఇప్పటివరకు ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌గా మాత్రమే పంపాల్సి ఉండేది. ఈ నియమం కారణంగా భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రామ్మోహన్ నాయుడు భక్తుల భావోద్వేగాలు, ఆచార పరమైన విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర భద్రతా సంస్థలతో సమన్వయం జరిపి ఈ ప్రత్యేక మినహాయింపుకు ఆమోదం తెలిపారు.
Details
జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో అమలు
ఈ సడలింపు తక్షణమే అమల్లోకి వస్తుందని, జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవధిలో శబరిమల యాత్రకు బయలుదేరే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలు పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని విమాన క్యాబిన్‌లో చేతి సామానుగా తమతో తీసుకెళ్లవచ్చు. అయితే భక్తులు ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించి, సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మంత్రి సూచించారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియలకు సంబంధించి అధికారులు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా అనుసరించాలన్నారు.
Details
భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి
యాత్ర పవిత్రతకు భంగం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయ్యప్ప భక్తుల ఆచార వ్యవహారాలకు గౌరవం తెలిపే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం, దేశం నలుమూలల నుంచి విమాన మార్గాన్ని ఎంచుకునే యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు. భక్తులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు లభించి, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.