
Telangana: రైతులకు శుభవార్త.. పంటల రుణ పరిమితి పెంపు.. టెస్కాబ్ కొత్త నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది.
రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) చేసిన ప్రతిపాదనల ఆధారంగా టెస్కాబ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆమోదించిన రుణ పరిమితి వివరాలను ప్రభుత్వం, బ్యాంకులు, అన్ని జిల్లాలకు పంపించినట్లు సమాచారం. ఈ కొత్త రుణ పరిమితి ప్రకారం రైతులకు పంట రుణాల పంపిణీ జరుగనుంది.
ఇదే సమయంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ - 2025-26 మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులు రుణాల మంజూరుకు సిద్ధం కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పంటలకు లభించే రుణ పరిమితి గణనీయంగా పెరిగింది.
Details
విత్తనోత్పత్తి చేసే రైతులకు మరింత ఎక్కువ పరిమితి
ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పుదాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలతో పాటు పశు, పక్షి, చేపల పెంపకానికి కూడ రుణ పరిమితి పెంచినట్లు టెస్కాబ్ ప్రకటించింది.
2025-26 వానాకాలం మరియు యాసంగి సీజన్‌కు వర్తించే ఈ కొత్త పరిమితుల్లో, వరి పంటకు ఎకరానికి రూ.1000 పెంపు చోటు చేసుకోగా, మొక్కజొన్న, పత్తి, వేరుశనగకు రూ.2000 చొప్పున పెంచారు.
సజ్జ, కంది, మినుములకు రూ.1000చొప్పున, పామాయిల్ సాగుకు రూ.4000 వరకూ పెంపు చేశారు.
పత్తి పంటకు గతేడాది రూ.46,000రుణ పరిమితి ఉండగా ఈ ఏడాది రూ.48,000కి పెరిగింది.
విత్తనోత్పత్తి చేసే రైతులకు మరింత ఎక్కువ పరిమితి లభిస్తుంది. ఉదాహరణకు మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు గరిష్టంగా రూ.86,000 వరకూ రుణం పొందొచ్చు.