
Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.
ఈ తగ్గింపు ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది.
మెట్రోలో ప్రయాణించే ప్రజలపై వడ్డుబారాన్ని తగ్గించేందుకు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు భారమవకుండా చూడాలని ఈ నిర్ణయానికి కారణమైందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
గతంలో కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కి పెంచాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీల పెంపుపై నగరంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
Details
ఈనెల 24 నుండి అమల్లోకి
జీహెచ్ ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ ఈ పెంపు నిర్ణయాన్ని వెంటనే తిరస్కరించాలని డిమాండ్ చేశారు.
పేద, మధ్య తరగతి వర్గాలపై ఈ ఛార్జీల పెంపు ఆర్థిక భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాలు కూడా మెట్రో ఛార్జీల పెంపుపై నిరసనలు వ్యక్తం చేసి ఉప్పల్ మెట్రో డిపో వద్ద ధర్నాలు చేపట్టాయి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఛార్జీల పెంపును 10 శాతం తగ్గిస్తూ ఈ నెల 24 నుండి అమలు చేయనుందని ప్రకటించింది.
దీనివల్ల మెట్రో ప్రయాణికులపై ఉన్న భారాన్ని కొంతమేర తగ్గించగలమని చెప్పారు.