Hyderabad: ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్‌లో దింపి తిరిగి రావాలంటేనే ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. ఏచిన్న పనికోసం బయటకు వెళ్లాలన్నా గంటల తరబడి వాహనాల మధ్యే సమయం గడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.అందుకే సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాల కోసం నగరవాసులు వెతుకుతున్నారు. అలా వచ్చిన ఆలోచనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన 15మినిట్స్ సిటీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం నివాస ప్రాంతాలకు కేవలం 15నిమిషాల దూరంలోనే కార్యాలయాలు,మార్కెట్లు, షాపింగ్ మాల్స్,మల్టీప్లెక్స్‌లు,స్కూళ్లు వంటి అన్ని అవసరాలు అందుబాటులో ఉంటాయి. వీటికి చేరుకోవడానికి వాహనాలు అవసరం లేకుండా నడక లేదా సైక్లింగ్ సరిపోతుంది. ట్రాఫిక్‌లో వృథాఅయ్యే గంటలను జీవితానికి మళ్లీ దక్కించుకునే అవకాశం ఈ విధానం కల్పిస్తోంది.
వివరాలు
కొత్త తరహా ప్రాజెక్టులపై డెవలపర్ల దృష్టి
వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు, పెరుగుతున్న మౌలిక వసతుల ఒత్తిడి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వినూత్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. గృహాలను కార్యాలయాలు, మార్కెట్లు, ఆరోగ్య సేవలు, వినోద కేంద్రాలతో అనుసంధానం చేసే ఈ కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అన్నీ నడక లేదా సైక్లింగ్ దూరంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంటి కొనుగోలుదారులు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, మెరుగైన కనెక్టివిటీకి ఎక్కువ విలువ ఇస్తున్నారు.
వివరాలు
కరోనా తర్వాత మారిన అభిరుచులు
కోవిడ్ తర్వాత నివాస ప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్లు, ఫిజియోథెరపీ స్టూడియోలు, ప్లే స్కూల్స్, పార్కుల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది. పర్యావరణంపై అవగాహన కూడా పెరిగింది. ఎత్తైన అపార్ట్‌మెంట్లకంటే పచ్చని పరిసరాలు, బహిరంగంగా నడిచే ప్రదేశాలు ఉండే ప్రాంతాలను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రోజువారీ అవసరాలన్నీ ఒక కిలోమీటరు పరిధిలోనే దొరకాలి, వీకెండ్‌లో వినోదానికి కూడా దగ్గరలోనే అవకాశాలు ఉండాలనే అభిప్రాయం బలపడుతోంది.
వివరాలు
నివాసాలకు దగ్గరగా వాణిజ్య అభివృద్ధి
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కూడా పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తోంది. నివాస ప్రాంతాలకు దగ్గరగా రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లో నివాసాలు ఒకచోట, కార్యాలయాలు మరొకచోట ఉండేవి. వినోదం కోసం వెళ్లాలంటే కూడా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని అవసరాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వివరాలు
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం
కోవిడ్-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ విధానాలు పెరగడంతో కంపెనీలు నివాసాలకు దగ్గరగా కార్యాలయ స్థలాలను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 60 నుంచి 70 శాతం మంది ఐటీ ఉద్యోగులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రోజూ ప్రయాణిస్తున్నారని అంచనా. ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి, అధిక కార్బన్ ఉద్గారాలకు కారణమవుతోంది. ఈ పరిస్థితులే హైదరాబాద్‌లో 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్‌కు మరింత ఆదరణ పెంచుతున్నాయి.
వివరాలు
15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్ అంటే ఏమిటి?
నడక లేదా సైక్లింగ్ దూరంలోనే పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, విశ్రాంతి, వినోద కేంద్రాలు ఉండేలా పట్టణ ప్రణాళికను రూపొందించడమే 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా, ఇంధన వినియోగం తగ్గిస్తూ ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ విధానం పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో రోజువారీ అవసరాలు తీరడం, ట్రాఫిక్ తగ్గడం, కార్బన్ ఉద్గారాలు నియంత్రించడం దీని ప్రధాన లక్ష్యాలు.
వివరాలు
ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కువగా అమలవుతోంది?
ఓ నివేదిక ప్రకారం నగరంలోని ఈస్ట్, వెస్ట్ సైడ్‌లలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లో 39 శాతం, దక్షిణ ప్రాంతాల్లో 32 శాతం వరకు ఈ తరహా అభివృద్ధి కనిపిస్తోంది. కొండాపూర్, మణికొండ, నర్సింగి, తెల్లాపూర్, నియోపోలిస్, మోకిలా, కొల్లూరు, కోకాపేట వంటి ప్రాంతాలు మినీ నగరాలుగా వేగంగా ఎదుగుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ కారిడార్ నుంచి తూర్పు వైపు ఐటీ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉప్పల్, పోచారం, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. దీంతో 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది.
వివరాలు
పచ్చదనం, నడకకే పెద్ద పీట
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా నివాస ప్రాంతాల్లో విస్తృతమైన పచ్చని ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక కిలోమీటరు పరిధిలోనే కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలు, పార్కులు, ఆసుపత్రులు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్లు, బైక్‌ల కంటే నడక, సైక్లింగ్‌కు ప్రోత్సాహం ఇస్తూ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం ఈ కాన్సెప్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.