LOADING...
Google: విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన
విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన

Google: విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరో మైలురాయిని అందుకుంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ విశాఖపట్టణంలో పెద్ద ఎత్తున డేటా సెంటర్‌ను నెలకొల్పబోతోందన్న సమాచారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో అధికారికంగా ధృవీకృతమైంది. ఈ ప్రాజెక్టుకు గూగుల్ ఏకంగా 6 బిలియన్ డాలర్లు (సుమారు ₹50,000 కోట్లు) వెచ్చించబోతున్నట్టు స్పష్టమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇన్వెస్ట్ ఇండియా' ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

వివరాలు 

ట్వీట్ ద్వారా అధికారికంగా వెల్లడించిన సంస్థ 

ఇప్పటికే కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ రానున్నదని చెప్పినా, ఇప్పుడు కేంద్రం ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి స్పష్టత లభించింది. ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్ ప్రకారం, విశాఖలో నిర్మించబడే ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దది కానుంది. అంతేకాదు, నిరంతర కనెక్టివిటీ కోసం సముద్ర గర్భం నుంచి మూడు భారీ అండర్‌సీ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం, దేశవ్యాప్తంగా ముఖ్యమైన డేటా హబ్‌లలో ఒకటిగా ఎదగనుంది. ప్రస్తుతం ముంబయి నగరం డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఉన్నా, విశాఖలో ఏర్పడనున్న కొత్త డేటా సెంటర్ దానికంటే రెట్టింపు సామర్థ్యంతో పనిచేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

విశాఖ ఐటీ హబ్ అభివృద్ధికి కీలక ముందడుగు 

రాష్ట్ర ప్రభుత్వం విశాఖను కీలక ఐటీ హబ్‌గా మార్చాలన్న ప్రయత్నాలకు ఈ భారీ పెట్టుబడి పెద్ద ఊతం ఇస్తుందనడం ఖాయం. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయి, ఎప్పటికి పూర్తవుతాయన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా, కేంద్రం అధికారిక ప్రకటనతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన ముందుకు కదిలే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్న టెక్ దిగ్గజం