Hydra: హైడ్రాకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణదారులకు భయపెట్టే హైడ్రా విభాగాన్ని మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వం దృష్టిసారించింది. పోలీసు కమిషనరేట్ల మాదిరిగా, హైడ్రాకు కూడా ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, సుమారు 3 వేల మంది అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటివరకు 28 మంది అధికారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషనరేట్‌కు మూడు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లో హైడ్రా కార్యాలయం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతీయ కార్యాలయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత హైడ్రా కార్యాలయం ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లో కొనసాగుతోంది. దీనిని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంగా మార్చనున్నారు. ఇదే భవనంలో బీ బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి కొత్త భవనాలను పరిశీలిస్తున్నారు. ఈ కమిషనరేట్‌లో అన్ని రకాల సాంకేతికతలు అందుబాటులో ఉండేలా ప్లాన్ సిద్ధంచేస్తున్నారు.