
BAPATLA TOURISM: బాపట్ల జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్.. కేరళ తరహాలో బోటు షికారు!
ఈ వార్తాకథనం ఏంటి
వాగులు, కాలువల మధ్య మడ అడవుల అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు పడవ విహారం చేసే ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
బాపట్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు జలవనరుల శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది.
ఈ ప్రాజెక్టు గురించి బాపట్ల జిల్లాకు వచ్చిన పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌కు, జిల్లా కలెక్టర్ వెంకటమురళి పీపీపీ ప్రదర్శన ద్వారా వివరాలు తెలియజేశారు.
కేరళ రాష్ట్రంలోని అలెప్పి మాదిరిగా, బాపట్లలో కూడా పర్యాటకుల కోసం పడవ విహారం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వివరాలు
సముద్రతీర ప్రాంతాల్లో పడవ విహారం
బాపట్ల, రేపల్లె, కర్లపాలెం, నిజాంపట్నం మండలాల తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ఉపరితలానికి వచ్చి చేరడం వల్ల ఈ ప్రాంతాలు పడవ విహారానికి అనుకూలంగా మారాయి.
వాగులు, కాలువల్లో పడవ విహారాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అభిప్రాయపడ్డారు.
వివరాలు
మడ అడవుల సహజ అందాలు
బాపట్లమండలం ఆదర్శనగర్ వద్ద ఈ విహారం ప్రారంభం కానుంది. నల్లమడవాగు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇసుక తిన్నెలలో ల్యాండింగ్ పాయింట్‌ను ప్రతిపాదించారు.
పర్యాటకులు నల్లమడ వాగు సంగమం,చుట్టూ మూడు వైపులా నీరు,ఒక వైపున భూమి ఉండే ద్వీపాకల్ప ప్రాంతాన్ని చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
అలాగే,పక్షుల సందర్శన కోసం ప్రత్యేకంగా విహారప్రణాళిక రూపొందించారు.
అక్కడి నుంచి పడవలు ఉప్పుటేరు ద్వారా ప్రయాణం కొనసాగించి,కర్లపాలెంమండలం తుమ్మలపల్లి రామాలయం సమీపంలోని రెండో ల్యాండింగ్ పాయింట్‌కు చేరుకుంటాయి.
అనంతరం,ఇసుక తిన్నెలు,మడ అడవుల అందాలను తిలకిస్తూ పడవలు తూర్పు తుంగభద్ర కాలువ వైపు ప్రయాణం చేస్తాయి.
ఆ తరువాత,1.5కి.మీ దూరంలో ఉన్న నిజాంపట్నం హార్బర్‌లో చివరి ల్యాండింగ్ పాయింట్‌ను చేరుకుని, అక్కడి సందర్శన అనంతరం తిరిగి ఆదర్శనగర్‌కు చేరుకుంటాయి.
వివరాలు
త్వరలో ప్రారంభమయ్యే విహారం
సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌కు వివరించామని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు.
తీర ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పడవ విహారం అతి త్వరలో ప్రారంభమై పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
పడవ విహారం మార్గం:
పేరలి కాలువ - 4 కి.మీ
నల్లమడ వాగు - 1.5 కి.మీ
ఉప్పుటేరు - 12.2 కి.మీ
తూర్పు తుంగభద్ర కాలువ -0.65 కి.మీ
మొత్తం విహారం దూరం -18.37 కి.మీ
కాలువల్లో కనీస లోతు - 1.65 మీటర్ల నుంచి 3.14 మీటర్ల వరకు
మొత్తం ల్యాండింగ్ పాయింట్లు - 4
ఏడాదిలో నీరు ఉండే రోజులు - 330