
TG Govt : జీపీవో పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. VRO, VRAలలో అసంతృప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
మొత్తం 10,954 పోస్టుల కోసం పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి మళ్లీ ఆప్షన్లు తీసుకుంటోంది.
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటన జారీ చేస్తూ, అభ్యర్థులు గూగుల్ ఫామ్ దరఖాస్తులు పూరించి ఏప్రిల్ 16లోపు సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తు ఫారమ్‌కు అభ్యర్థులు స్వయంగా సంతకం చేసి, సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.
పని విధానం, నియామక నిబంధనల పూర్తి వివరాలు https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Details
పునరాలోచనలో పూర్వ వీఆర్వో, వీఆర్ఏలు
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి జీపీవో పోస్టుల కోసం ఆప్షన్లు స్వీకరించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ గూగుల్ ఫామ్ నింపి సమర్పించాల్సిన సూచనల నేపథ్యంలో ఈ నియామకంపై కొత్త చర్చ మొదలైంది.
ప్రభుత్వం ఇటీవల జీవో నం. 129 జారీ చేయగా, పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోమని స్పష్టంగా తెలిపింది. దీంతో ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు ఇప్పుడు తిరిగి ఆలోచనలో పడ్డారు.
అధికారికంగా ఏదో ఒక శాఖలో విధులు నిర్వహిస్తున్నందున, సేవా కాలాన్ని జీరోగా పరిగణించుకోవడం వల్ల తమకు అదనంగా ఏమి లభిస్తుందనే ప్రశ్న వారికి ఎదురవుతోంది.
చాలా మంది వీఆర్ఏలు ఇప్పటికే పర్మినెంట్ అయ్యారు.
Details
ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ అవసరం
వారిలో ఉన్నత విద్యావంతులు, ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ ద్వారా ప్రత్యక్ష నియామకం పొందిన వారు కూడా ఉన్నారు.
తమ ఉద్యోగ అనుభవాన్ని కోల్పోవడానికి వారు సిద్ధంగా లేరని సమాచారం.
జీపీవో పోస్టులకు ఇంటర్ విద్యతో పాటు ఐదేండ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాల్సిన నిబంధనను ప్రభుత్వం పెట్టింది.
అయితే ఈ ఐదేండ్ల సేవను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల అభ్యర్థులకు నష్టమే జరుగుతుందని వారంతా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
Details
గతంలో ఇచ్చిన ఆప్షన్లు వృథా?
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించింది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తమ ఆసక్తిని తెలిపినట్లు సమాచారం.
5,130 మంది వీఆర్వోల్లో 3,534 మంది, 16,000 మంది వీఆర్ఏల్లో 5,987 మంది రెవెన్యూ శాఖలో చేరేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్లు ఈ వివరాలను పరిశీలించి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను వడపోసి, అర్హులైనవారిని గుర్తించారు.
కానీ రెవెన్యూ శాఖలో ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు ఉన్నవారు జీపీవోలుగా పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు.
అలాగే ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో రీ-డెప్లాయ్‌మెంట్ పొందిన వారు తిరిగి రెవెన్యూలో చేరి సమస్యలు ఎదుర్కోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
Details
గ్రామ పాలనాధికారులకు 9 రకాల విధులు
ఈ జీపీవో నియామక ఉత్తర్వుల్లో గ్రామ పాలనాధికారులకు 9 రకాల విధులను ప్రభుత్వం డిజైన్ చేసింది.
ఈ విధులు గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా ఉన్న సమయంలో నిర్వహించినవే కావడం గమనార్హం.
అయితే పాత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం, నిబంధనల్లోని అనిశ్చితి కారణంగా నియామక ప్రక్రియపై మరింత చర్చ జరుగుతోంది.