Page Loader
Telangana: పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2,355 కోట్ల ప్రణాళిక.. ప్రభుత్వ చర్యలు ప్రారంభం
పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2,355 కోట్ల ప్రణాళిక.. ప్రభుత్వ చర్యలు ప్రారంభం

Telangana: పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2,355 కోట్ల ప్రణాళిక.. ప్రభుత్వ చర్యలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం పట్టణస్థానిక సంస్థల్లో (Municipal Bodies) అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ఊపందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్రంలోని అన్ని నగర, పట్టణ పాలక సంస్థల కోసం అత్యవసర అభివృద్ధి పనుల నిమిత్తం ప్రత్యేక నిధుల్ని కేటాయించనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రూ.2,355 కోట్ల మేర బడ్జెట్‌ను సిద్ధం చేయిస్తున్నట్టు సమాచారం. ఈ నిధులను తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రుణంగా తీసుకుని, ఆయా మున్సిపల్ సంస్థలకు పంపిణీ చేయనున్నారు. నెలాఖరుకల్లా ఈ ప్రాసెస్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

వివరాలు 

నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులన్నీ నెమ్మదించాయి

ఇటీవల కాలంలో నగర పాలక సంస్థల్లో అభివృద్ధి పనులు గణనీయంగా మందగించడం గమనార్హం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే, మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. తదనంతరం ఇవన్నీ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. అయితే, నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులన్నీ నెమ్మదించాయి. పాలక మండలుల గడువు ముగిసే సమయంలో, అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినప్పటికీ, అప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించలేకపోవడం వల్ల కొత్త పనులు మొదలుపెట్టడం సాధ్యపడలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యవసర అవసరాల నిమిత్తం తక్షణ నిధుల మంజూరు నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

పనుల జాబితా సిద్ధం

ప్రతి పట్టణస్థానిక సంస్థకు సగటున రూ.15 కోట్ల చొప్పున నిధులను కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 157 పట్టణస్థానిక సంస్థలకు (జీహెచ్‌ఎంసీ తప్పించి) కలిపి రూ.2,355 కోట్లు మంజూరు చేయనున్నారు. ఈ నిధులతో పాత బకాయిలను కొంతవరకు తీర్చడంతో పాటు, తక్షణంగా చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు పూర్తిచేయనున్నారు. ఇందులో తాగునీరు సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే పట్టణస్థానిక సంస్థల వారీగా చేయాల్సిన పనుల జాబితా సిద్ధంగా ఉండటం వల్ల, పనుల అమలుకు వేగంగా చర్యలు తీసుకునే అవకాశముంది.