
MK Stalin: గవర్నర్ ఆర్.ఎన్. రవిపై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడులో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తత!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి (RN Ravi)కి మధ్య నెలలుగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) గవర్నర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సాంఘిక సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రవి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. రాజకీయాల్లో అవన్నీ సహజం. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి మాత్రం ప్రతిపక్షాల కంటే ముందుకు వెళ్లి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఉండి అధికార డీఎంకే ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
Details
మహిళల భద్రతపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
రాష్ట్రం ప్రతిపాదించిన బిల్లులను ఆమోదించడం లేదు. తమిళ గీతాన్ని అవమానపరుస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్య, శాంతి భద్రతలు, మహిళల భద్రతపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని గుర్తు చేశారు. ఈ వాస్తవం గవర్నర్‌కు నచ్చక ప్రజా వేదికలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ గవర్నర్ ద్వారా తమిళనాడులో చౌకబారు రాజకీయాలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ఇటీవల గవర్నర్ రాష్ట్రంలో మహిళల భద్రత, యువత మాదకద్రవ్యాల వినియోగం వంటి పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు అదే రోజు తిప్పికొట్టారు.