తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై
తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గత కొంత కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణకు గురికావడం మరోసారి ఆసక్తికరంగా మారింది. గతంలోనూ ఎమ్మెల్సీ కోటా కింద హుజురాబాద్ బీఆర్ఎస్ నేత, పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైంది. దాసోజు శ్రవణ్, కర్రా సత్యనారాయణ ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అయితే కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదని రాష్ట్ర ప్రథమ పౌరురాలు వివరించారు.
ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు : తమిళిసై
గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యే అర్హతలు ఈ ఇద్దరి వ్యక్తులకు లేవన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న దాసోజు శ్రవణ్ ఈ మధ్యనే బీజేపీలో చేరారు. అనంతరం, కొద్ది రోజులకే మునుగోడు ఉపఎన్నికకు ముందు జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోవడం గమనార్హం. అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు దాసోజు పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితాకు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతకొంత కాలంగా ఈ ఫైలును తన వద్దే పెట్టుకున్న గవర్నర్, ఆ ఫైలును తిరస్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.