తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ కార్పోరేషన్ ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజారవాణా స్థంభించిపోయింది. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కార్మికులు బంద్ పాటించారు. ఆర్టీసీ సేవలను నిలిపేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
గవర్నర్ నివాసం వద్దకు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు
మరోవైపు హైదరాబాద్ మహానగరంలోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియర్ పిలుపునిచ్చింది. ఉదయం 10గంటల వరకే ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని TMU ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి సూచించారు. అనంతరం 11 గంటలకు గవర్నర్ అధికారిక నివాసం ముందు ధర్నా చేసేందుకు కార్మికులు ప్లాన్ రెఢీ చేసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతివ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పట్టుబట్టారు. ఒకవైపు నల్గొండలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన కొనసాగుతుండగా ఇంకోవైపు డిపో వద్దే గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్షకు వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన చేపట్టారు. ఇటీవలే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ ఆమోదించింది.