
online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యటనలపై ఇప్పుడు సైబర్ నేరగాళ్ల దృష్టి పడింది.
భక్తిగా యాత్రలకు వెళ్లే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మోసాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఫేక్ వెబ్‌సైట్లు, ఫేస్ బుక్ పోస్టులు, గూగుల్ సెర్చ్ ఫలితాల్లో నకిలీ పెయిడ్ ప్రకటనలు పెడుతూ యాత్రికులను మోసం చేస్తున్నారు.
ఈ ఘటనలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. ఛార్‌ధామ్ యాత్రికులతో పాటు ఇతర ఆధ్యాత్మిక పర్యాటకులే ఈ మోసాల లక్ష్యంగా మారుతున్నారని గుర్తించింది.
దీనిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పౌరులను హెచ్చరిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
వివరాలు
పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి
ఈ ప్రకటన ప్రకారం, పర్యాటక సేవల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, వాట్సప్ నంబర్ల ద్వారా సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా కేదార్నాథ్ యాత్రికుల కోసం హెలికాప్టర్ బుకింగ్స్, ఛార్‌ధామ్ యాత్రికులకు హోటల్, అతిథిగృహాల బుకింగ్‌లు, ఆన్‌లైన్ క్యాబ్, ట్యాక్సీ సేవలు, హాలిడే ప్యాకేజీల పేర్లతో మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది.
ఈ నకిలీ వెబ్‌సైట్ల ద్వారా సేవల కోసం చెల్లింపులు చేసిన పర్యాటకులకు అనంతరం ఎలాంటి సమాచారం అందకపోవడమే కాకుండా, వారు సంప్రదించిన ఫోన్ నంబర్లు స్పందించకుండా ఉంటున్నాయని వివరించింది.
అందువల్ల ఈ మోసాలను నిరోధించేందుకు పర్యాటకులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వివరాలు
కేంద్రం అవసరమైన చర్యలు
ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా వస్తున్న లింకులు లేదా 'Sponsored' అని చూపించే లింకులు నొక్కే ముందు అవి నకిలీవా, నిజమైనవా అనేది నిర్ధారించుకోవాలని సూచించింది.
ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా నమ్మదగిన ప్రైవేటు ఏజెన్సీల సేవలను మాత్రమే ఉపయోగించాలని సైబర్ విభాగం స్పష్టం చేసింది.
మోసానికి గురైనట్టు అనిపిస్తే వెంటనే cybercrime.gov.in పోర్టల్‌లో లేదా 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులకు సూచించింది.
ప్రజలను మోసపోకుండా చూడటానికి కేంద్రం కూడా గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్ సంస్థలతో కలిసి పని చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.