మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.
హింసాత్మకంగా మారిన మణిపూర్‌లో గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతి ప్రణాళికను ప్రకటించిన ఒక రోజు తర్వాత కర్ఫ్యూను ఎత్తివేయడం గమనార్హం.
అంతేకాదు, పోలీసు ఆయుధాలను ఎత్తుకుపోయిన వారు కూడా తిరిగి అప్పగిస్తున్నారు.
హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక తర్వాత మణిపూర్‌లో శుక్రవారం 140 ఆయుధాలను ఆందోళనకారులు అప్పగించారని రాష్ట్ర పోలీసులు తెలిపారు.
ఒక నెల క్రితం జాతి హింస చెలరేగిన సమయంలో పోలీసుల నుంచి 2,000 ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు.
ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో అధునాతన ఆయుధాలలో AK-47లు, INSAS రైఫిల్స్, టియర్‌గ్యాస్, స్టెన్‌గన్‌లు, గ్రెనేడ్ లాంచర్ అనేక రకాల పిస్టల్స్ ఉన్నాయి.
మణిపూర్
310మందికి గాయాలు
గత నెలలో మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు 98 మంది మరణించారని, 310 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న 10 జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన అనంతరం ఘర్షణలు చెలరేగాయి.
మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. వీరు ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజన తెగకు చెందిన కుకీలు, నాగాలు జనాభాలో మరో 40శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకి తెగకు చెందిన వారిని వెల్లగొడతారనే ప్రచారం నేపథ్యంలో రెండు జాతుల మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది.