Arvind Kejriwal : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపు రాతలు.. పీఎంవో ని నిందించిన ఆప్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దానికి నేరుగా బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీ తీవ్ర భయాందోళనలకు గురవుతోందని అన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ హత్యాయత్నానికి పాల్పడుతోందని అన్నారు. ఈ కుట్ర PMO ఆఫీస్ నుండే జరుగుతోందన్నారు. రాజీవ్ చౌక్, పటేల్ నగర్ మెట్రో స్టేషన్లలో కేజ్రీవాల్‌పై దాడి చేస్తామని బెదిరింపు రాతలు రాసున్నాయన్నారు.
కేజ్రీవాల్‌ను బీజేపీ ఎంతగానో ద్వేషిస్తోంది
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి కుట్ర జరుగుతోందని, అందులో ఆయన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని సంజయ్ సింగ్ అన్నారు. పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద బెదిరింపు రాతలు రాస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ ఎంతగానో ద్వేషిస్తోందని, రేపు అయనకు ఏదైనా జరిగితే దానికి భాజపా, ప్రధానమంత్రి కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జైల్లో కూడా 23 రోజులు ఇన్సులిన్ ఇవ్వలేదన్నారు.
కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత
మూడుసార్లు ఎన్నికైన ముఖ్యమంత్రిని బహిరంగంగా బెదిరిస్తున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అన్నారు. మే 19న దాడి చేసి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో లోపల కేజ్రీవాల్ ను చంపుతామని రాసుందని మెట్రో డీసీపీ తెలిపారు. దీన్ని ఎవరు రాశారు అనే కోణంలో విచారణ జరుగుతోందన్నారు. మెట్రో లోపల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నమన్నారు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ హోర్డింగ్‌పై అభ్యంతరకరమైన కొటేషన్ కూడా వ్రాయబడింది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ పోలీసులపై ప్రశ్నలు సంధించిన అతీషి
అదే సమయంలో రాజీవ్ చౌక్,పటేల్ నగర్ మెట్రో స్టేషన్,అనేక మెట్రో రైళ్లలో చంపేస్తామని బెదిరింపులు రాశారని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి చెప్పారు. ఈమెట్రో స్టేషన్లన్నీ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయి. ఇక్కడ 24గంటలు పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది ఉంటే ఒక వ్యక్తి బెదిరింపు రాతలు వ్రాసి ఇక్కడ నుండి ఎలా వెళ్లతాడన్నారు. ఈ వ్యక్తి బెదిరింపులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడని తెలిపారు. ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్ ఇప్పుడు ఎక్కడికి పోయాయి?ముఖ్యమంత్రిని బహిరంగంగా బెదిరిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీ పోలీసులు స్వాతి మలివాల్ నకిలీ ఆరోపణలపై సూపర్ యాక్టివ్ అయ్యారు,ఇప్పుడు ఎందుకు ఏమీ చేయడం లేదు అంటూ అతిషి ప్రశ్నలు సంధించారు.