LOADING...
Telangana News: 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబరు మూడో వారం కంటే ముందే నిర్వహణ?

Telangana News: 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబరు మూడో వారం కంటే ముందే నిర్వహణ?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా వచ్చే 25 లేదా 26 తేదీల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఈసీకి ఆదేశాలు పంపించగా, ఎన్నికల సంఘం కూడా రెండు వేర్వేరు పోలింగ్‌ తేదీల ప్రతిపాదనలు పంపింది. డిసెంబర్ 10, 13, 16 లేదా 11, 14, 17 తేదీల్లో ఓటింగ్ నిర్వహించేలా ఎంపికలు సూచించింది.

వివరాలు 

ఈసీ సూచనలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష

స్థానిక ఎన్నికల అంశంపై ఈ నెల 24న హైకోర్టు విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్ల అమలుకు కోర్టు అనుమతిస్తే, తాజా ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. తర్వాత ఈ నెల 25న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశముంది. ఆమోదం వచ్చిన వెంటనే అదే రోజు లేదా తర్వాతి రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది. 50% రిజర్వేషన్ల అమలుపై వివరాల నివేదికను పంచాయతీరాజ్ శాఖకు అందించేందుకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించగా, ఆ నివేదిక గురువారం సమర్పించబడింది. ఇప్పుడు ఈసీ సూచనలపై శుక్రవారం ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, షెడ్యూల్, ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది.

వివరాలు 

రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు 

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఈసీ అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులుతోపాటు జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వచ్చే నెల మూడో వారికల్లా ఎన్నికలు జరిగే అవకాశముండటంతో, కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల 22, 23 తేదీల్లో అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లను తుది నిర్ణయానికి తెచ్చుకోవాలని ఆదేశించింది. ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలనే ప్రణాళిక ప్రకారం, ఆయా జిల్లాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముద్రణ, పోలింగ్ కేంద్రాల సిద్ధం, బ్యాలెట్ బాక్సులు, అవసరమైన ఇతర సామగ్రి ముందుగానే రెడీగా ఉంచాలని తెలిపింది. అదేవిధంగా ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండేలా, వారి సెలవులు రద్దు చేయాలని కూడా ఆదేశించింది.

వివరాలు 

50% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌! 

గ్రామపంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శాసనసభ, మండలిలో చట్ట సవరణ జరిపి రిజర్వేషన్ పరిమితిని తొలగించినప్పటికీ, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం రాలేదు. ఇప్పుడు పాత విధానాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడానికి మళ్లీ చట్ట సవరణ అవసరమని అధికారులు భావించారు. దీనికోసమే తాజా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం కోసం పంపించబడ్డాయి. ఆమోదం వచ్చిన వెంటనే 50% రిజర్వేషన్లపై అధికార ప్రకటన విడుదల చేయబడుతుంది.