
Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టం ఏర్పాటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ - అమరావతి డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్,నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు పాల్గొన్నారు. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తీసుకోవాల్సిన కార్యాచరణను స్పష్టంగా తెలియజేస్తూ ఈ డిక్లరేషన్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన రెండు రోజుల సమ్మిట్‌లో వివిధ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు, పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఆ సమ్మిట్‌లో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ డిక్లరేషన్‌ను ప్రకటించింది.
వివరాలు
దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టం ఏర్పాటు
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనువైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందంజలో నిలిచేలా, దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టాన్ని ఏర్పాటు చేయడమే ఈ అమరావతి డిక్లరేషన్ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.