Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! త్వరలో పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగాన్ని అందుకోనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి మళ్లీ శ్రీకారం చుట్టబోతోంది.
ఈ నేపథ్యంలో, నేడు సీఆర్డీఏ (Capital Region Development Authority) 45వ సమావేశం నిర్వహించనుంది.
నిర్మాణాలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్
ఈ సమావేశంలో, క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు కాంట్రాక్టులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌ను అందజేయనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 12 నుంచి 14 మధ్య నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించడంతో, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన వెంటనే పనులు లాంఛనప్రాయంగా ప్రారంభం కానున్నాయి.
Details
ప్రధాన నిర్మాణ పనులివే
సీఆర్డీఏ పరిధిలో మొత్తం 90 నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
మొదటి దశలో 73 పనులకు పరిపాలనపరమైన ఆమోదం లభించింది. వీటిలో ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల నిర్మాణాలు ఉన్నాయి.
నిధుల సమీకరణ
ఈ నిర్మాణాల కోసం రూ.15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా మంజూరు చేసింది. మొత్తం 45,249 కోట్ల రూపాయల నిర్మాణ ప్రాజెక్టులకు సీఆర్డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
అసెంబ్లీ భవనం నిర్మాణానికి - రూ.765 కోట్లు
హైకోర్టు భవనానికి - రూ.1,048 కోట్లు
ఐకానిక్ టవర్ల నిర్మాణానికి - రూ.4,665 కోట్లు
రహదారుల టెండర్ల కోసం - రూ.9,699 కోట్లు
ఇతర రోడ్ల నిర్మాణానికి - రూ.7,794 కోట్లు
Details
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రపంచ బ్యాంకు నుండి తీసుకునే రూ.15వేల కోట్ల రుణంతోపాటు, మిగిలిన మొత్తాన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.31,000 కోట్లు సేకరించేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని తిరిగి ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు మొదలైనవి తొలి దశలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అభివృద్ధి చర్యలతో అమరావతి మళ్లీ రాజధాని నిర్మాణ హబ్‌గా మారబోతోంది.