
Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి-పాకాల-కాట్పాడి రూట్‌లో రైల్వే డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
మొత్తం 104 కిలోమీటర్ల పొడవులో ఉన్న ఈ మార్గంపై డబ్లింగ్ పనులు సుమారు రూ.1,332 కోట్ల వ్యయంతో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పర్యాటకాభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుందని చెప్పారు.
లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గాన్ని ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు.
Details
14 లక్షల మందికి లబ్ధి
ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఈ మార్గంలోనే ఉండటంతో, అక్కడి అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు.
ఇది కేవలం పర్యాటక అభివృద్ధికే కాకుండా వైద్య, విద్య రంగాలకు కూడా కీలకమైందని చెప్పారు. తిరుపతి-వెల్లూరు మార్గం ద్వారా అనేక ప్రజలకు మెరుగైన వసతులు అందనున్నాయని వెల్లడించారు.
డబ్లింగ్ పనులు పూర్తయ్యితే, 400 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 14 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుందని వివరించారు.
అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశముండి, ఏటా 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యం ఏర్పడుతుందన్నారు.