GST: కొత్త జీఎస్టీ అమలుతో.. నవంబర్‌లో రూ.131 కోట్ల లోటు
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ 2.0 అమలుతో రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. జీఎస్టీ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించడంతో,దానికి అనుగుణంగా రాష్ట్ర వాటాగా లభించే జీఎస్టీ ఆదాయం కూడా తగ్గిపోయింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తరువాత తొలి గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. అందులో, గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో ఏపీకి వచ్చే జీఎస్టీ ఆదాయం రూ.131 కోట్ల మేరకు,అంటే 4.61 శాతం తగ్గినట్లు వెల్లడైంది. కేంద్రం సవరించిన జీఎస్టీ 2.0 ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
వివరాలు
జీఎస్టీ 2.0తో నవంబరులో ఆదాయం తగ్గిపోయింది
అక్టోబర్ నెలలో జరిగిన కొనుగోళ్లు, అమ్మకాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు అన్నీ తాజా ధరల ప్రకారమే సాగినందున,వాటి ప్రభావం నవంబర్‌లో రాబడి రూపంలో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో మంచి వృద్ధి నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే అప్పటివరకు దాదాపు 5.80 శాతం వరకూ రాబడి పెరిగింది. అయితే జీఎస్టీ 2.0తో నవంబరులో ఆదాయం తగ్గిపోయింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్ర రాబడిపై ప్రభావం తప్పదని ఆర్థిక శాఖ అధికారులు ముందుగానే అంచనా వేసినట్టు తెలిపారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా వస్తువుల విక్రయాలు సంఖ్యా పరంగా పెరిగినా,రేట్ల తగ్గింపుతో మొత్తం వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడిందని విశ్లేషిస్తున్నారు.
వివరాలు
పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గింది
ప్రధానంగా ఆటో మొబైల్,సిమెంట్,ఎలక్ట్రానిక్ పరికరాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గడంతో, ఎస్‌జీఎస్టీ ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కొనుగోళ్ల పరిమాణం పెరిగినా ధరలు తగ్గడమే వసూళ్ల ఆశించిన స్థాయిలో పెరగకుండా చేసిన కారణంగా పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిందని విశ్లేషణలో తేలింది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో ఆ విభాగంలో 1.06 శాతం మేర తగ్గుదల నమోదైంది. మధ్య ఆంధ్ర, కోస్తా ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో 'మోంథా' తుపాను ప్రభావంతో వాహనాల రాకపోకలు గణనీయంగా తగ్గాయని, దానివల్ల వ్యాపార లావాదేవీలు మందగించాయని అధికారులు తెలిపారు. ఆ పరిస్థితుల ప్రభావం కూడా జీఎస్టీ ఆదాయంపై పడిందని మరో అంచనాగా పేర్కొన్నారు.