Page Loader
HAM Roads: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి హ్యామ్‌ విధానం.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క 
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి హ్యామ్‌ విధానం.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క

HAM Roads: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి హ్యామ్‌ విధానం.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ విధానం అమలుపై వచ్చే రెండు రోజుల్లో మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆమె తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ విధానం అమలైన తీరు, అనుభవాలను విశ్లేషించిన తర్వాత మన రాష్ట్రానికి అనుగుణంగా దీన్ని పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఈ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో హ్యామ్ ఆధారిత రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళాశక్తి, స్త్రీనిధి, మిషన్ భగీరథ, అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

వివరాలు 

18,472 కిలోమీటర్ల మేర రోడ్ల  అభివృద్ధి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ - "హ్యామ్ విధానంతో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధిలో పెద్ద మార్పు వస్తుంది. ప్రతి గ్రామంలో రోడ్లు మెరిసిపోతాయి. మొత్తం 18,472 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 7,947 కిలోమీటర్ల రోడ్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడతాం. ఇందుకోసం వచ్చే 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలి" అని సూచించారు. అలాగే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల అనేక సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93 వేల గ్రామస్థాయి ఉద్యోగులకు ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు.

వివరాలు 

1,440 అంగన్‌వాడీ కేంద్ర భవనాలు 

ఎంపీడీవోల బదిలీలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉందని, వారి వాహనాల అద్దె భత్యానికి సంబంధించిన దస్త్రం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని వివరించారు. వీటికి త్వరలోనే అనుమతులు మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పనుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 1,440 గ్రామ పంచాయతీ భవనాలు, 1,440 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ఈ ఏడాది నిర్మించనున్నట్లు చెప్పారు. శాఖలో ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

వివరాలు 

పంచాయతీల పెండింగ్ బిల్లులకు త్వరలో పరిష్కారం 

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సోమవారం పంచాయతీ కార్యదర్శుల సంఘం (టీపీఎస్‌ఏ) అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నేతలు అరుణ్, వాణి తదితరులు మంత్రిని కలిసి తమ సమస్యలను వినిపిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ తర్వాత టీపీఎస్‌ఏ ప్రతినిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ను కూడా కలిసి అదే విషయంపై వినతిపత్రాన్ని అందజేశారు.