
Tenali: తెనాలి,నిజాంపట్నం కాలువలో బోటు షికారుకు అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
తెనాలికి 'ఆంధ్రా ప్యారిస్' అన్న పేరు రావడం వెనుక కారణాల్లో ఒకటి పట్టణం మధ్య నుంచి పారిస్‌లో మాదిరిగా మూడు పంట కాలువలు పారుతుండటమే. ఈ కాలువలు సుమారు 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల గట్టులను అభివృద్ధి చేసి, వాటిలో బోటు షికారులను ప్రవేశపెట్టితే తెనాలి పర్యాటకంగా మరింత ప్రముఖత పొందుతుందని చాలా కాలంగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యేగా, ఉపసభాపతిగా, సభాపతిగా ఉన్న సమయంలో ఈ ఆలోచనకు ఊపొచ్చింది. అధికారులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కాలువల మీదుగా ప్రయాణానికి అనుకూలంగా "ఆకాశ నడక వంతెన" నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, నమూనాలు, అంచనాలను రూపొందించారు.
వివరాలు
విజయవంతమైన నమూనా డ్రైవ్
అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ మంత్రి హోదాలో ఆయన ఈ అంశాన్ని ప్రాధాన్యతతో తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. తొలుత మధ్య కాలువ అయిన నిజాంపట్నం కాలువలో బోటు షికారుకు కసరత్తు మొదలైంది.. మంత్రి మనోహర్ ఆదేశాలతో జలవనరుల శాఖ అధికారులు గత మూడు నెలలుగా దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటక శాఖ అధికారులు కూడా అనేకసార్లు ప్రదేశాన్ని పరిశీలించారు. ఆదివారం రోజు నిర్వహించిన నమూనా డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. పట్టణప్రాంతంలోని కాలువలో చిన్న బోటును నడిపి వివిధ ప్రాంతాల్లో నీటి లోతులను గుర్తించారు. అలాగే గట్టుల అభివృద్ధి,ప్రజలు బోటులో ఎక్కే దిగే ప్రాంతాలను గుర్తించడం,ఆ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్న అంశాలపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వివరాలు
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా
తెనాలిలో స్వాభావికంగా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించాలనే ఉద్దేశంతో బోటు షికారుకు శ్రీకారం చుట్టినట్టు అధికారులు పేర్కొంటున్నారు. తదుపరి దశల్లో ఈ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు సుందరమైన అనుభవాన్ని, ఆహ్లాదకరమైన పర్యటన అవకాశాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. బోటు షికారులు ప్రారంభమైన అనంతరం తెనాలి నగరం ఒక ఆధ్యాత్మికం, పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.