గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు
కరోనాకు భయపడి ఓ మహిళ మూడేళ్లుగా బయటకు రావడం లేదు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి లోపల ఉంటుంది. కనీసం తన భర్తను కూడా లోపలికి రానివ్వకపోవడం గమనార్హం. హర్యానా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన పోలీసు అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం, 33ఏళ్ల మహిళ మున్మున్ తన మైనర్ కొడుకుతో కలిసి మూడేళ్లుగా చక్కర్‌పూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో తాళం వేసుకుని జీవిస్తోంది. భర్త సుజన్ మాఝీ ఎంత చెప్పినా బయటికి రాని పరిస్థితి. ఫిబ్రవరి 17న సుజన్ మాఝీ చక్కర్‌పూర్ పోలీస్ పోస్ట్‌లో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లీకొడుకులకు మానసిక వైద్యశాలలో చికిత్స
పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ సభ్యుల బృందం ఇంటి మెయిన్ డోర్‌ను పగులగొట్టి మున్మున్ తోపాటు ఆమె 10ఏళ్ల కొడుకును బయటకు తీసుకొచ్చారు. అనంతరం తల్లీకొడుకులను చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించారు. మున్మున్‌కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో తల్లీకొడుకులను మానసిక వైద్యశాలకు రిఫక్ చేశారు. అక్కడ చితిత్స అందిస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా సుజన్ పని చేస్తున్నారు. 2020లో మొదటి లాక్‌డౌన్ తర్వాత ఆంక్షలు సడలించినప్పుడు సుజన్ ఆఫీసుకు వెళ్లడానికి బయటకు వచ్చిన తర్వాత, ఆయన ఇంట్లోకి రావానికి మున్మున్ అనుమతించలేదు. అప్పటి నుంచి అతను అదే ప్రాంతంలోని మరొక అద్దె నివాసంలో ఉంటున్నాడు.