Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు ఎంపిక
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులను ఎన్నికల కమిషనర్‌లుగా నియమించినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు ఈరోజు ఉదయం సమావేశమైంది. పోల్ అధికారులను ఎంపిక చేసేందుకు నియమించిన ప్యానెల్‌లోని ముగ్గురు సభ్యులలో చౌదరి ఒకరు. అయితే ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తక్కువ సమయంలో ఇంత మంది పేర్లను ఎలా పరిశీలిస్తారు..?: అధిర్ రంజన్ చౌదరి
"ఈ కమిటీలో భారత ప్రధాని న్యాయమూర్తికి చోటు ఉండాల్సిందని, గతేడాది తీసుకువచ్చిన కొత్త చట్టం దీన్ని కుదించిందని, ప్యానెల్‌లో ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, వారు కోరుకుంటున్నది జరిగిందని" ఆయన అన్నారు. "నిన్న అర్ధరాత్రి తన పరిశీలనకు 212 పేర్ల జాబితా వచ్చిందని, ఈ రోజు ఉదయం, ఆ జాబితాతో నేను ప్రధాని నివాసానికి వెళ్లవలసి వచ్చింది, ఇంత తక్కువ సమయంలో ఇంత మంది పేర్లను ఎలా పరిశీలిస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. షార్ట్‌లిస్ట్ చేసిన ఆరు పేర్లలో ఉత్పల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠి, జ్ఞానేష్ కుమార్, ఇండెవర్ పాండే, సుఖ్‌బీర్ సింగ్ సంధు,సుధీర్ కుమార్ గంగాధర్ రహతే, మాజీ బ్యూరోక్రాట్‌లు ఉన్నారు.
మార్చి 15 లేదా 16న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం
గత నెలలో అనూప్ చంద్ర పాండే ఎన్నికల కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తి ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం కీలకం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికల సంఘం మార్చి 15 లేదా 16న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.