Page Loader
CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం 
కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?

CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పదవికి జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపిక కానే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్‌ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీఈసీ ఎంపిక ప్రక్రియలో భాగంగా, సెర్చ్‌ కమిటీ ఐదుగురిని ఎంపిక చేసి, వారి జాబితాను ఎంపిక కమిటీకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉన్నారు.

వివరాలు 

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులో జ్ఞానేశ్‌ కుమార్‌ కీలక పాత్ర

జ్ఞానేశ్‌ కుమార్‌ 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కేంద్ర హోం శాఖ, సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగానికి నాయకత్వం వహించడంతో పాటు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు.