
hailstones: తెలంగాణలో వడగళ్ల వాన విజృంభణ.. రైతులకు భారీ ఆర్థిక నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అత్యధికంగా నిర్మల్ జిల్లా ముథోల్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
వడగళ్ల వానతో పొట్టదశలో ఉన్న ధాన్యం, మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట పూర్తిగా నేలకూలింది.
ఎంతో శ్రమించి పెంచిన పంట కేవలం పది నిమిషాల్లో నాశనమైందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
Details
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలిపోవడంతో చందెకర్ దౌలత్(79) అనే వ్యక్తి మృతిచెందారు.
మరోవైపు మండుటెండతో అల్లాడిన ప్రజలకు అకస్మాత్తుగా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనాన్ని అందించాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో గాలులు వీచాయి.
మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై, గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దిగువకు చేరాయి.
Details
శని, ఆదివారాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
వాతావరణ శాఖ ప్రకారం, శని, ఆది, సోమవారాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.